కొలువులు కొట్టడంలో దిట్టలు ఓయూ విద్యార్థులు

ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంవిద్యాపరంగానే కాకుండా ఉద్యోగాల సాధనకు ఊపిరిలూదుతోంది. దశాబ్దాల తన కీర్తి చరితను నలుదిశలా చాటుతోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో సుమారు 3 వేల మంది కానిస్టేబుళ్లుగా, 200 మంది ఎస్‌ఐలుగా ఇటీవల నియమితులయ్యారు. తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. యువతరానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంత మంది ఓయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందడం ఇదేతొలిసారి కావడం గమనార్హం.


ఉస్మానియా యూనివర్సిటీ: వారంతా ఉన్నత విద్య పూర్తి చేశారు. తాము కోరుకున్న ఉద్యోగం రాకున్నా తొలుత ఏదో ఒక దాంతో ఉపాధి పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా వేలాది మంది ఓయూ విద్యార్థులు పోలీసు ఉద్యోగాలకు పోటీపడ్డారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా సివిల్, ఏఆర్, సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఫైర్‌ తదితర విభాగాల్లో 16,925 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు, 1,275 ఎస్‌ఐ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో క్యాంపస్‌తో పాటు ఓయూ చుట్టూ ఉన్న మాణికేశ్వర్‌నగర్, విద్యానగర్, తార్నాక, నల్లకుంట, హబ్సిగూడ, రాంనగర్, మెట్టుగూడ, లాలాగూడ, అంబర్‌పేట్, ఉప్పల్‌ తదితర ప్రాంతాలకు చెందిన ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడి గదుల్లో ఉంటూ యూనివర్సిటీ లైబ్రరీలో రోజుల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఓయూ క్రీడా మైదానాల్లో ఫిజికల్‌ టెస్టులకు ప్రాక్టీస్‌ చేశారు. పోలీసు ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం.