అమరావతిలో ‘అసైన్డ్‌’ ప్లాట్ల కేటాయింపులు రద్దు

అమరావతిలో 'అసైన్డ్‌' ప్లాట్ల కేటాయింపులు రద్దు


సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించారు. కాగా దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్‌ భూములను కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. అనంతరం సీఆర్‌డీఏ వీటిని భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. అసైన్డ్‌ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే.





 








ల్యాండ్‌ పూలింగ్‌ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. కాగా అసైన్డ్‌ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: బహుళ రాజధానులే బహుబాగు)