నకిలీల ఆటకట్టు..

నకిలీల ఆటకట్టు..


సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్‌చల్‌ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా   చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్‌  చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. 



 







జరిగిన సంఘటనలు.. 
►ఈ ఏడాది జూన్‌ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు.


►ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.


►పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు.


ప్రత్యేక దృష్టి సారించాం.. 
నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్‌చల్‌ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. 
–  సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు