ప్రియాంక గాంధీకి భద్రతా వైఫల్యంపై వాద్రా ఫైర్...
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ ఇంట్లోకి భద్రతా వ్యవస్థ కళ్లుగప్పి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో దీనిపై ఆమె భర్త రాబర్డ్ వాద్రా స్పందించారు. ఇది కేవలం ప్రియాంకకో, తన కుమార్తెకో, కుమారుడికో, తనకో, గాంధీ కుటుంబ భద్రతకో సంబంధించిన విషయం కాదని, మన పౌరులకు, ముఖ్యంగా ఈ దేశంలోని మహిళలకు, వారి భద్రతకు, సురక్షితంగా ఉన్నామా లేదా అనే భావనకు సంబంధించిన విషయమని అన్నారు. దేశవ్యాప్తంగా భద్రతపై రాజీపడుతున్నారని ఓట్వీట్‌లో ఆయన విరుచుకుపడ్డారు.
'బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎలాంటి సమాజాన్ని మనం సృష్టిస్తున్నాం? ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వం బాద్యత. మనదేశంలో మనమే భద్రంగా లేకపోతే, ఇళ్లలో, రోడ్లపై, పగలు, రాత్రి వేళ అనే తేడాలేకుండా ఎక్కడా భద్రత లేకుంటే, ఎప్పుడు, ఎక్కడ మనం సురక్షితంగా ఉంటాం?' అని వాద్రా ఆ ట్వీట్‌లో దిగజారుతున్న దేశ పౌరులు, ముఖ్యంగా మహిళా భద్రతను ఎండగట్టారు.
ఇటీవలే సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను కేంద్ర హోం శాఖ తొలగించింది. గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని నిఘా ఏజెన్సీల సమాచారంతో వారికి ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించారు. దానికి బదులుగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే కేంద్రం ఎస్పీజీ తొలగించిన కొన్ని రోజులకే ప్రియాంక నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.
పెద్దల సభకు బిల్లు...
ఆసక్తికరంగా, ఎస్పీజీ సవరణ బిల్లు-2019కి ఇటీవల కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ అనంతరం లోక్‌సభ ఆమోదించగా, ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు.